CID NOTICES: మార్గదర్శి ఎండీకి సిఐడి నోటీసులు..

CID Notices: మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సిఐడి దూకుడు పెంచింది. మార్గదర్శి కార్యకలాపాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలపై కొద్ది నెలల క్రితం స్టాంప్స్‌ అండ్ రిజిస్ట్రేషన్స్‌ శాఖతో పాటు ఏపీ సిఐడి మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో తాజాగా మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌కు సిఐడి నోటీసులు జారి చేసింది.

ప్రభుత్వ తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది చిట్‌ ఫండ్స్‌ రెగ్యులేటరీ యాక్ట్‌కు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ ఉమ్మడి ఖాతాను నిర్వహించడం, చీటీ పాటల సొమ్మును ఒకే ఖాతాకు బదలాయించడం, ఖాళీగా ఉన్న చిట్లలో సొమ్మును ఎగవేయడం, బ్యాంకు ఫోర్‌మెన్‌తో సంబంధం లేకుండా ఏకీకృత ఖాతాలో లావాదేవీలు నిర్వహించడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. మరోవైపు మార్గదర్శి సంస్థపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. మార్గదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా మార్గదర్శి ఎండికి ఏపీ సిఐడి నుంచి నోటీసులు అందాయి.

మార్గదర్శి సంస్థలో నిర్వహించిన దర్యాప్తులో నిజానిజాలను వెలికి తీయడానికి శైలజా కిరణ్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిఐడి నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని శైలజా కిరణ్‌ నివాసం, కార్యాలయంలో విచారణకు హాజరు కావొచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 29, 31, ఏప్రిల్ 3, 6 తేదీలలో ఏదో ఒక సమయంలో విచారణకు హాజరు కావాలని సిఐడి సూచించింది. శైలజా కిరణ్‌ విచారణకు హాజరు కావడానికి అనువైన తేదీని ముందే తెలియ చేయాల్సిందిగా పేర్కొన్నారు. సిఐడి మెయిల్ లేదా, వాట్సాప్ నంబర్లకు సమాచారం అందించాలని సిఐడి డిఎస్పీ రవికుమార్‌ పేరుతో నోటీసులు అందచేశారు.

మార్గదర్శి సంస్థ సెక్షన్ 420, 120బి, 477ఏ,రెడ్ విత్ 34తో పాటు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్‌ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, చిట్‌ఫండ్ యాక్ట్ సెక్షన్ 76,79 ప్రకారం మార్గదర్శిపై కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

2023-03-28T04:43:51Z dg43tfdfdgfd