DELHI LIQUOR CASE : మాగుంట రాఘవ బెయిల్ రద్దు.. సరెండర్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు

Delhi Liquor Case Latest Updates: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవకు మరో షాక్ తగిలింది.మంజూరు అయిన మధ్యంతర బెయిల్ రద్దు అయ్యింది. రాఘవ మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అమ్మమ్మ కు అనారోగ్యం కారణంగా మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

రాఘవకు బెయిల్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ పలు విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అమ్మమ్మ బాత్రూంలో జారిపడినందుకు బెయిల్ మంజూరీ చేయడం సబబు కాదని ఈడీ తరపు న్యాయవాది ఏఎస్ జి ఎస్ వి రాజు వాదించారు. ఐసీయూలో ఉన్నప్పుడు ఎవరినీ చూడడానికి అనుమతించరని... మాగుంట రాఘవ మాత్రమే అమ్మమ్మ ను చూసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు వారాలు మాత్రమే హైకోర్టు రాఘవకు బెయిల్ మంజూరీ చేసిందని రాఘవ తరపు లాయర్ దేశాయ్ వాదించారు. అయితే మొదట నాయనమ్మ బాత్రూంలో జారిపడిందని చెప్పారని.... నాయనమ్మ అయితే రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారుగా చూసుకోవడానికి అన్నప్పుడు ...కాదు కాదు...అమ్మమ్మ అని మళ్లీ అబద్దం చెప్పారని ఈడీ తరపు న్యాయవాది లెవనెత్తారు.

తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ మధ్యంతర బెయిల్ కోరారని, దాన్ని ట్రయల్ కోర్టు కొట్టివేసిందనే విషయాన్ని కూడా ఈడీ తరపు లాయర్ ధర్మాసనం ముందు ఉంచారు. రాఘవ బెయిల్ పై విడుదలై రెండు రోజులైందని... ఇప్పటికే అమెను రాఘవ చూసి రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... రాఘవకు మంజూరు అయిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది. జూన్ 12వ తేదీన స్థానిక కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత ఫిబ్రవరిలో మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్నారు. గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ.

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.

2023-06-09T08:59:28Z dg43tfdfdgfd