Loan App Harassment: లోన్ యాప్ వేధింపులతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎస్.శ్రావణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు.
దయ్యాల వారిపల్లెకు చెందిన రైతు జయరామిరెడ్డి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి బీటెక్ పూర్తిచేసి ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట ఇన్‌స్టెంట్ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. కొంత మొత్తం తిరిగి చెల్లించినా భారీగా తిరిగి చెల్లించాలని వేధిస్తున్నారు.
యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేయడంతో అప్పు తీసుకున్న దానికంటే అధికంగా దాదాపు రూ.3.50 లక్షల వరకు చెల్లించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొన సాగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పులు తీర్చుకునేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రిని కోరడంతో వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చాడు. కొడుకు అవసరాల కోసం ఇప్పటికే కొంత డబ్బును అతని బ్యాంకు ఖాతాలో ఇప్పటికే జమ చేశారు.
ఈ నెల 26న అప్పు తీసుకొచ్చి కొడుక్కి డబ్బు ఇచ్చేందుకు తండ్రి ఏర్పాట్లు చేశారు. శ్రావణ్‌కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు చేరుకుని అక్కడి పూత పల్లేశ్వరస్వామి ఆలయంలోని కిటికీ కమ్మీలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మృతుడి తల్లి దండ్రులతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి తన వెంట కొత్తగా కొనుగోలు చేసిన కొడవలితో పాటు కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని లోన్ యాప్ ఆగడాలతో పాటు క్రికెట్ బెట్టింగుల కోసం కూడా అప్పులు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
2023-05-26T04:24:12Z dg43tfdfdgfd