TTD UPDATES: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24గంటల సమయం

TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్‌ లేని భక్తుల దర్శనానికి 24గంటల సమయం పడుతోంది. గురువారం 74,583మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 40,343 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా గురువారం 3.37కోట్ల రుపాయల ఆదాయం సమకూరింది. క్యూ కాంప్లెక్సుల వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్లు నిండిపోయాయి. టైమ్ స్లాటెడ్ దర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి ప్రవేశించే వారికి దర్శనానికి 24గంటలకు పైగానే సమయం పడుతోంది.

గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు…

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

రాత్రి 7.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 26వ తేదీ ఉదయం 8.22 నుంచి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వ‌హిస్తారు.

జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ఆహ్వానం…

జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్‌ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డికి వివరించారు.

జూన్ 8వ తేదీ మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు.

2023-05-26T02:39:09Z dg43tfdfdgfd